Friday, August 30, 2013

Chimpanzee memory-చింపాంజీ జ్ఞాపకశక్తి







    చింపాంజీలు, ఒరాన్‌గుటాన్‌లు తెలుసు... ఈ వానరాలకు మనుషుల్లాగే ఎన్నో తెలివితేటలున్నాయని తెలుసు... వీటికి జ్ఞాపకశక్తి కూడా మెండేనట... ఈ సంగతి కొత్తగా బయటపడింది.

మీరోసారి మీ మావయ్య వాళ్లింటికి వెళ్లారు. అప్పుడో కొత్త రకం సెంటును కొట్టుకున్నారు. మళ్లీ మూడేళ్ల తర్వాత మీరు ఆ సెంటు వాసన చూస్తే వెంటనే పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అది మావయ్య వాళ్లింట్లో వాడినట్టు టక్కున గుర్తొస్తుంది. మనకే కాదు చింపాంజీలు, ఒరాంగుటాన్‌లకు కూడా ఇలాంటి జ్ఞాపకశక్తి ఉందని తేలింది.

* చింపాంజీలు, ఒరాం గుటాన్‌ల తెలివితేటల గురించి ఇది వరకే తెలుసు. చెట్ల కొమ్మల్ని, కర్రల్ని పరికరాల్లా వాడగలవని, వాటితో అవసరమైన వస్తువులను దగ్గరకు లాక్కోగలవని ఎన్నో పరిశోధనల్లో తేలింది. అయితే వీటికి వారం రెండు వారాల విషయాల దగ్గర నుంచీ మూడేళ్ల కిందట జరిగిన సంగతులు కూడా గుర్తుంటాయని ఇప్పుడు కొత్తగా తెలిసింది.

* డెన్మార్క్‌లోని ఆర్హుస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రజ్ఞులు చేసిన జ్ఞాపకశక్తికి సంబంధించిన ఈ పరిశోధన ఆసక్తికరంగా సాగింది.
* మీకేదైనా కొత్త బొమ్మ కొనిస్తే దాన్ని ఎలా వాడాలో తెలీదు. దాని గురించి ఎవరైనా వివరంగా చెబితే చక్కగా ఆడుకుంటారు. అయితే కొన్నేళ్ల తర్వాత ఆ బొమ్మను మీకిచ్చినా దాన్ని ఎలా ఉపయోగించాలో మరిచిపోరు. ఇదిగో చింపాంజీలు, ఒరాంగుటాన్‌ల జ్ఞాపకశక్తిని తెలుసుకోవడానికి కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. ఇంతకీ ఏం ప్రయోగం?

* వీటి ముందు వేరు వేరు డబ్బాల్లో కొన్ని రకాల పరికరాలు పెట్టారు. వాటిల్లో కొన్ని వీటికి పనికొచ్చేవి, కొన్నేమో ఎందుకూ ఉపయోగపడనివి. ఈ జంతువులకు పనికొచ్చే వస్తువులను ఎలా వాడాలో కూడా కిటుకు తెలిసేలా అక్కడ ఏర్పాట్లు చేశారు. పైగా వీటికి చూపిన పరికరాల గురించి అంతకుముందు వీటికి అస్సలు తెలియదు. మళ్లీ మూడేళ్ల తర్వాత అవి వాడిన పరికరాలను వాటి ముందు పెట్టి, పరిశోధకులు కనిపించకుండా దాక్కున్నారు. వెంటనే ఒరాంగుటాన్‌లు, చింపాంజీలు మూడేళ్ల క్రితం వాడిన దానికన్నా వేగంగా ఆ పరికరాలను వాడాయి. అంటే ఆ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో గుర్తుంచుకున్నాయన్నమాట.

* ఈ వానరాల జ్ఞాపకశక్తి చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు.
* ఇదే కాదు రకరకాల తీర్లలో వీటి జ్ఞాపకశక్తిని పరీక్షించారు. ఎలా అంటే ఇవి గతంలో విన్న ధ్వనులు, వాసనలు వీటిపై ప్రయోగించారు. దీంట్లోనూ దాని జ్ఞాపకశక్తిని నిరూపించుకున్నాయి. మొత్తానికి చింపాంజీలకు, ఒరాంగుటాన్‌లకు తెలివితోపాటు జ్ఞాపకశక్తి కూడా బోలెడని తెలిసింది కదూ!

  • ============================

 Visit my website : Dr.Seshagirirao.com _ 

No comments:

Post a Comment

Thanks for your comment !